Kodavantimata
కొంగు బంగారమౌ కొడవంటి మాట (వేదాంతం)
ఓం రామలాల్ ప్రభు సమారంభాం నారాయణ ప్రభు మధ్యమాం
అస్మాదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరామ్
1.ఈశ్వరుండు
గలడు ఈ శరీరమునందు - దిశ మారినను చాలు దైవ దర్శనమ్మగును
కక్ష్య
మారినయట్లు గ్రహము గ్రహమునకు - కొంగు
బంగారమౌ కొడవంటి మాట
2.తోలు
కనులకు దైవ దర్శనము దుర్లభము - కోలుకొని
మనసు మరుగు పడిన చాలు
కల్గు
మూడవ కన్ను కనుబొమల నడుమ - కొంగు
బంగారమౌ కొడవంటి మాట
3.
జలము కలుషితమైన కనజాలమేమియు - జలము
నిర్మలమైన నిజము తెలియు
మనసు
నిర్మలమైన నిజరూపదర్శనమె - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
4.
మనుషుల మనసు మారుట సహజమ్ము - మనసు మధియింప
మహనీయుడగును
మనలోని
మహనీయుడాదేవదేవుడే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
5.
జిడ్డు కృష్ణమూర్తి జగతిలో వేదాంతి - జిడ్డు
వదిలించుకొని జితేంద్రియుడయ్యె
జడ్డి
తనము వీడ జయము తధ్యము సుమ్మి - కొంగు
బంగారమౌ కొడవంటి మాట
6. నేను ఎవరొ తెలియమన్నారు రమణులు-నేను నీవు
ఒకటె శరీరము వేరు
లోని గుట్టు తెలియ లోకమ్మె తెలియును - కొంగు బంగారమౌ కొడవంటి మాట
7. శాంతి మార్గమె ముద్దు యుద్ధమసలే వద్దు - శాంతి దూతవు నీవు జ్ణాన
జ్యోతివి నీవు
జ్యోతినే వెలిలించు బాహ్యాంతరములందు -
కొంగు బంగారమౌ
కొడవంటి మాట
8.
సూర్యోదయమ్మెపుడు శుభమునే కాంక్షించు - సూర్యుడే
లేకున్న సృష్టి అనునది కల్ల
సూర్యుడే
మనలకు సూటియౌ దైవము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
9.
మనసున్న మనిషికే మౌనమ్ము చెల్లు - మనసు
లేకున్నచో మనుగడే లేదు
మనసులో
మర్మమే మహాయోగమ్ము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
10.
అర్ధమక్కరలేదు అసలైన బాబాకు – వ్యర్ధవేష
ధారి వేనవేలాశించు
స్థితప్రజ్ఞునకు
సిరి సంపదలు ఏల – కొంగు బంగారమౌ కొడవంటి మాట
11. మనోనేత్రము తెరవ
మార్గమే తెలియు - మనసు రంజిల్లెడి మర్మమే తెలియు
మనోజయమ్మున మృత్యుంజయుండగు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
12. మనసులేని బ్రతుకు నరకమేనంట - మనసున్న
మనిషికి సుఖము లేదంట
మనసు మనసున నిలుప మహనీయుడంట - కొంగు బంగారమౌ కొడవంటి మాట
13. తినగ
తినగ వేము తియ్యనగును - మనసు మూలమ్మే
మాయరోగమ్ము
కనుము మూడవ కన్ను కనకాభిషేకమే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
14. గుండె చప్పుడు నీకు గుడిగంట కారాదు - గుండె గూటిలో గుహ్యమగు గురుతుంది
ఒడిసి పట్టిన చాలు విశ్వ దర్శనమే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
15.
సకలమ్ము నిండెనదె సచ్చిదానదమ్ము – అకలంకునాత్మ అది అంతటను నిండె
నికరమగు
చూపుననె నిజరూప దర్శనము - కొంగు బంగారమౌ కొడవంటి
మాట
16.
ఆత్మయే నిత్యము ఆత్మయే సత్యము – ఆత్మయే నీవు అన్యమ్ముగావు
ఆత్మ
స్వరూపమే అంతటను నిండె - కొంగు బంగారమౌ కొడవంటి మాట
17.
అహము వీడిన చాలు ఆత్మ దర్శనమగును – ఆహరహము ఆనంద నందనమ్మగును
మహిలోన
దివ్యమౌ దర్శనమ్మిది సుమా - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
18.
నీవు నీవుగాని నిక్కమొక్కటి గలదు – నీవు ఎవరో తెలియ నిత్య ఆనందమే
నీవు
నిర్మలుడవు నిరంజనుడవు - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
19.
ఉపవాసమన కడుపు కాల్చుట కాదు – ఉప వసించుటయే దేవదేవునకు
ఉపవాసి
ఎల్లపుడు ఉల్లాసముగనుండు - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
20.
జీవన్ముక్తుడై ఉండగలిగెడి యుక్తి – జీవియందెల్లపుడు జీవించి యుండు
జీవ
భావము వీడ దైవత్వమబ్బు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
21.
మనసు అనునది మార్పు చెందుచునుండు – మనసు గతి నిర్జించు మార్గమొక్కటియె
మనో
జయమ్మున మృత్యుంజయుండగుటె - కొంగు బంగారమౌ కొడవంటి మాట
22.
నేడు యోగమ్మనిన ఆరోగ్యమునకండ్రు – నాడు యోగమ్మనిన మేటి యోగులకెరుక
నాడు
నేడును ఎఱుక నీవు ఎవరవొ తెలియ - కొంగు
బంగారమౌ కొడవంటి మాట
23.
కాంతా కనకములు కానరావాతనికి – అంతరాత్మను అతడు ఆహరహము దర్శించు
అంతర్ముఖుండతడు
అవనిలో అమృతుడు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
24.
విత్తమందాశతో విహరించు యోగివలె – చిత్తమును తెలియని చిత్తరువు పగిది
చిత్తము
జయించిన చైతన్యుడే యోగి - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
25.
అంతరము తెలియని అతడెట్లు యోగి – అంతయును నాదనెడి ఆత్మ వంచన తప్ప
అంతరాత్మను
తెలియునాతడే యోగిరా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
26.
యోగమనగా వడలు వంచుకొనుట కాదు – యోగి వేషమున విహారము కాదు
యోగమనగా
మనిషి మహనీయుడగుటయే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
27.
ఇంపైనవన్నియు ఇహ లోక సుఖములే – కంపు మయమైపోవు కాల గమనమున
సొంపైన
చైతన్య దర్శనమె సౌఖ్యమ్ము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
28.
మతము మతము అని మారాము చేయకు – మతములోనను లేదు మానవ గమ్యము
ఆత్మ
తత్త్వము తెలియ అంతయు మిథ్యయే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
29.
భూతద్దమున భాను కిరణమే జ్వలియించు – అంతరాత్మయందు ఆనంద జ్వలనమ్ము
ఎంత
తెలిసినగాని సుంతయే అది సుమ్మి - కొంగు బంగారమౌ కొడవంటి మాట
30.
సూర్య కిరణము సూది మొనదేలు కటకమున – సౌర శక్తికి సాటి ఏమియు లేదుగద
సౌర
శక్తియె గలదు ప్రతి శరీరమునందు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
31.
మోడువారిన మాను మొగ్గ తొడుగుట కల్ల – ఏడేడు వసంతాలెదురైననుగాని
మూడు
నాళ్ళ బ్రతుకు మూలమ్ము తెలియరా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
32.
కుక్క పంది యేన్గు కుడుములు కావవి - తిక్క
పెట్టించెడి తంటాలు తెలియంగ
తిక్కలన్నియు తీర్చు తురీయావస్థయే
- కొంగు
బంగారమౌ కొడవంటి మాట
33. పరమాత్మను చూచు పరికరములే వేరు - పర తత్త్వమగు జ్యోతి వెలగవలె లోలోన
పరమాత్మ దర్శనము పదము పదమునకు - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
34. దేహ ధారివి నీవు దేహివి నీవు – దేహిని
మృత్యువు ముట్టుటయె కల్ల
దేహియే దైవము సాధననె సాధ్యము -
కొంగు బంగారమౌ కొడవంటి మాట
35. విత్తమందాశను వీడుము మొదట –
చిత్తము చిదంబరమందుంచుము పిదప
ఆత్మ దర్శనమపుడె తధ్యము సుమ్మి
- కొంగు బంగారమౌ కొడవంటి మాట
36. గాలి బుడగయె కదా ఈ
జీవితమ్ము – జాలి వుండదు అది జఱ్ఱున జారు
కాల గమనము అది కడు విచిత్రమ్ము
- కొంగు బంగారమౌ కొడవంటి మాట
37. గమ్యమ్మునెరిగెడి మర్మమ్ము
తెలియ – చిన్మయమ్మగునట్టి తావేదొ తెలియు
ఆత్మ దర్శనమదియె అమరత్వమదియే -
కొంగు బంగారమౌ కొడవంటి మాట
38. గుడి గంట కావాలి గుండెలోని గంట – గుడియె
దేహమ్ము గంటయే పరమాత్మ
గుడిలోని గంటయే నిజముగా నీవు -
కొంగు బంగారమౌ కొడవంటి మాట
39.
పుట్టుట గిట్టుట తెలియని బ్రతుకు –మట్టిలో కలసి మాయమగు బ్రతుకు
గట్టు
చేరెడి గుట్టు తెలియని బ్రతుకు - కొంగు
బంగారమౌ కొడవంటి మాట
40.
నేను ఏదియు కాదు అన్నియు నేనే – నేను నీవు తెలియ నిఖిలమ్ము తెలియు
నేను
నీవునొకటె నిత్య సత్యమ్మిదియె - కొంగు
బంగారమౌ కొడవంటి మాట
41.
ఊర్ధ్వ దృష్టి వలన ఔన్నత్యమే పొందు – ఆర్ద్రత ఉప్పొంగ ఆత్మ దర్శనమగు
మర్మమంతయు
తెలిసి మృత్యుంజయుండగు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
42.
ఆనందమంతయు అంతరముననె గలదు – జన్మ రాహిత్యమౌ జన్నమును గలదు
మేను
మై మరపించి మర్మమును గాంచుమా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
43.
తపము చేయ తనువు తన్మయత్వమునొందు – తపము చేయ తత్త్వదర్శనము గలుగు
తపము
చేయ తనువు తంటాలు తీరురా - కొంగు బంగారమౌ కొడవంటి
మాట
44.
గురుడనంగ గుహ్య విద్యకే గురుతు – గుర్తుగాను గుహ్య నేత్ర దర్శనమ్మగును
మరువలేని
మోక్ష సామ్రాజ్యమది సుమా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
45.
యోగమనగ ఆత్మ ఐక్యమ్ము సుమ్మి – యోగమనగ సత్య దర్శనము సర్వత్ర
యోగమనగ
యోగ్యమైనట్టి విద్యరా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
46.
భక్తి భావము నిండ నిండినను చాలు – భవ బంధమ్ములు తొలగినను చాలు
భవుడు
ప్రత్యక్షమ్ము బొంది లోపలను - కొంగు బంగారమౌ కొడవంటి మాట
47.
క్షరము అగునదియే దేహమ్ము సుమ్మి అ –
క్షరమ్మది ఆత్మ నశియించదెపుడు
ఆక్షర
సత్యమ్ము అనాదినుండిదియె - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
48.
భక్తి ప్రదమైనది భగవాను వెలుగు – శక్తి ఎంతో గలది సూర్యదేవుని వెలుగు
ముక్తి
మార్గమునకే మూలమగు వెలుగు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
49.
ఆస్తికత్వమ్మే అలరారెడి వెలుగు – ఆస్తితో కొనలేని అవ్యక్తమగు వెలుగు
ఆ
స్థితిలొ మాత్రమే వ్యక్తమగు వెలుగు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
50.
దేహియైన వెలుగు దేహమున వెలుగు – గుహ్యమైన వెలుగు గురుదేవు వెలుగు
దహరవిద్యలోని
దైవమే ఆ వెలుగు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
51.
కనుబొమల నడుమ కాంతి పుంజమ్ము – జ్ఞాన నేత్రమ్మదియె విజ్ఞానమదియె
అనుభవమ్మగునట్టి
ఆత్మ దర్శితమదియె - కొంగు బంగారమౌ కొడవంటి
మాట
52.
కాంతా కనకముల ఆశ వీడినగాని – శాంతము సౌఖ్యము కలుగుటయె కల్ల
సాంతమగు
మనసునకె కాంతి దర్శనము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
53.
మహా ప్రస్థానమీ మహిలోన తధ్యము – మహదానందమది మనమెవరొ తెలియు
మహితాత్ముడౌ
దేవ దేవుడే ప్రతి జీవి - కొంగు బంగారమౌ కొడవంటి మాట
54.
మనసునాడించెడి మర్మమే నీవు – మనసు మర్మము తెలియ మాయ తొలగు
మనసునే
మధియింప మహితాత్ముడే గదా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
55.
దృష్టి మూలము తెలియ ద్రష్టయగును – సృష్టియే తెలియు సుస్పష్టముగను
అదృష్టమదియే
అవని లోపలను - కొంగు బంగారమౌ కొడవంటి మాట
56.
ఈసునియందాసనుంచినను చాలు – శ్వాసను శాంతము పరచినను చాలు
అశాంతి
లేనట్టి ఆత్మ దర్శనమగును - కొంగు బంగారమౌ కొడవంటి మాట
57.
నీవు నేనే సుమ్మి నేను నీవే సుమ్మి – నీవు నిజమ్ముగ నిర్గుణుండవు సుమ్మి
నీవు
నిండితివి నిఖిల జగమునను - కొంగు బంగారమౌ కొడవంటి మాట
58.
నిజమునెరిగిన గురుడె నీకు దైవమ్ము – నిజము నిజమిది అని నిక్కమ్ము తెలుపు
నిజము
తెలియును నీకు నిజ మార్గమును - కొంగు బంగారమౌ కొడవంటి మాట
59.
నిత్య సంతోషివి నిజముగా నీవు – సచ్చిదానంద స్వరూపుదడవీవు
మాతాతీతమ్మగు
మర్మమే నీవెగా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
60.
సత్య దర్శియైన సామ్రాట్టు ఒక్కడే – సత్య సాధనమున గమ్యమ్ము చేర్చు
సత్య
దర్శనమగును నిత్యము నీకు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
61.
ఆత్మయే నిత్యము ఆత్మయే సత్యము – ఆత్మ రూపమె నీవు ఆనందమే నీవు
ఆత్మయే
వ్యాపించె అణువణువునందు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
62.
మార్పు ప్రతి మనిషికి సహజమ్ము సుమ్మి – మారుచు నుండును క్షణము క్షణమునకు
మార్పులేనిది
అది మోడుయగు సుమ్మీ - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
63.
నీలోన నాలోన నిజము దాగున్నది – ఆలోచనముననే అసలు తెలియు
సాలోచనముననే
సర్వము తెలియును - కొంగు బంగారమౌ కొడవంటి మాట
64.
నిత్య క్రతువే బ్రతుకు నిక్కమ్ము వేరు – నిత్య సంతోషికే నిజము తెలియు
అత్యంత
ఆనంద ఆత్మానందమది – కొంగు బంగారమౌ కొడవంటి మాట
65.
సేతు బంధనమే తేలిక అనుకొనిన – దేహ బంధనమున
దేహి దర్శనమగు
దేహియే
దైవము స్వస్వరూపమ్మదియె - కొంగు బంగారమౌ కొడవంటి మాట
66.
ధ్యానమనగ దేవదేవు దర్శనమ్ము – ధ్యానమనగ దేహి దర్శనమ్మే సుమా
ధ్యానమున
దర్శించు స్వస్వరూపమ్మదియె - కొంగు బంగారమౌ కొడవంటి మాట
67.
ఆదిత్యుడది ఏమి అస్తమించుట ఏమి – అది భ్రాంతియే కాని అసలు కాదు
నాది
శరీరము కాని నేను వేరే కదా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
68.
డొంక తిరుగుడె గదా డొల్ల దేహమ్ము – డొంక సరిచేసిన దొరతనమ్మబ్బు
డొంకలో
గలడు దొడ్డ దేవరయే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
69.
జీవితాంతమువరకు జీవించ వలెను – జీవితము లోగుట్టు తెలుసుకో వలెను
జీవ
భావము వీడ దైవత్వమబ్బు - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
70.
శుభము ఎల్లపుడూ శుభమునే కోరు – శుభమునకు రేబవలు కానరాదు
శుభమైన
మనసుకె సుఖము కలుగు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
71.
ముచ్చట ఐనది ముణ్ణాళ్ళ ముచ్చటయె –
మచ్చుకైనను అది మిగలుట కల్ల
వచ్చును
పోవును వెవేల జన్మలు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
72.
నిజముగా చూసేది నిద్రలో చూసేది – నిజముకాదవి నిజము నీదు భ్రాంతి
నిజము
నీకు తెలియు నిను నీవు తెలియ - కొంగు
బంగారమౌ కొడవంటి మాట
73.
మానవుని పెన్నిధి మాధవుని సన్నిధే – మనసు నిర్మలమైన మాయ మాసినను
మనోజయమును
పొంది మాధవుని చేరు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
74.
అష్ట దిక్కులును అరుణోదయము భ్రాంతి – నామ రూపమును నీవు నేను భ్రాంతి
భ్రాంతి
లేని బ్రతుకు బ్రహ్మానందమే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
75.
రజ్జు సర్ప భ్రాంతి రాకపోకలు చూడు – ఎండ మావులవలే అండ లేని బ్రతుకు
రాజు
పేదైనట్లు రంభ వచ్చినయట్లు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
76.
దేహమే దేవళము దేవళమె దేహము – దేహ దేవళములయందలిదె దేహి
దేహినే
తెలియంగ దేహముతొ పనిలేదు - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
77.
ఛిద్రమైన మనసు శాంతింపజేయ – భద్రముగ బంధమ్ము సడలింపజేయ
చిత్రమైన
కాంతి చేర్చు గమ్యమును - కొంగు బంగారమౌ కొడవంటి మాట
78.
అరుణోదయమ్మెపుడు ఆహ్లాదకరమే – ఆరంభమది ఆత్మ జిజ్ఞాసువులకు
మరణమే
లేనట్టి మహా ఉదయమ్ము - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
79.
సూర్యోదయమ్మెపుడు శుభ సూచకమ్ము – సూర్యోపాసనయె
సాధకుల అంతరము
లోని
సూర్యుని తెలియ లోకమ్ము తెలియు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
80.
అంతర దృష్టితో ఆనందమే నిండు – చింతలన్ని
తీరు చైతన్యముదయించు
అంతమే
లేనట్టి ఆత్మ దర్శనమగు - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
81.
కులమతమ్ముల కుళ్ళు కనరానియట్టి – కలిమితోనెవ్వరు కొనలేనియట్టి
వెలకట్టలేనట్టి
వేద సారముగనుమ - కొంగు బంగారమౌ కొడవంటి మాట
82.
సంపదగలదని సంబరము వద్దు – సంపద మనకు సాధనయె కాదు
సాధన
సంపదయె గమ్యమ్ము చేర్చు - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
83.
విత్తమ్ముతోను పనియేమి లేదుగా – చిత్తమ్ముతోనే పనియంతయునుగా
విత్తమందాశను
వీడుటయె పరము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
84.
అరిషడ్వర్గాలు ఆవురావురు మనగ – మురిపించి మనసునే మట్టుబెట్ట
దరిశనమె
దేహి దివ్యత్వమే కల్గు - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
85.
ముక్తియే భవబంధ నాశనమ్ము – ముక్తియే నిజభక్తి దాయకమ్ము
ముక్తియే
నిజరూప దర్శనమ్ము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
86.
నవద్వారపురి నాశనమ్మగునది – నవద్వారపురపు నేతవు నీవు
నీవు
నిత్యమ్ము నశియించు పురము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
87.
మృత్యుంజయుడవీవు మరణమే లేదు – అమృతత్వమ్మునే ఆస్వాదింతువు
నిర్గుణమ్మదియె
నీదు నిజ రూపు - కొంగు బంగారమౌ కొడవంటి
మాట
88.
పుట్టుచున్నారెందరెందరో ఈ పుడమి – పుట్టిరి గిట్టిరి మన పూర్వులెందరో
పుట్టుటలు
గిట్టుటలు దేహికిగాదు - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
89.
మట్టి ముద్దయైన ఈ శరీరము మాయ – మట్టియై పోవు మరు భూమియందు
గట్టి
పట్టు పట్టి గమ్యమును చేరుమా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
90.
మనసునందు పుట్టె మాయ అంతయును – మనసు విరిగెనేని మాయ తొలగు
మనసు
నిలిచేనేని మహి తాను బ్రహ్మము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
91.
మరణమే లేనట్టి నాద బ్రహ్మము నీవు – పరమ సత్యమ్మిది పరికించి చూడ
చరాచారములు
అన్ని చైతన్యమే కదా! - కొంగు బంగారమౌ కొడవంటి మాట
92.
మంచి ముత్యమ్మై నీ మనసు ఉన్నది – మంచిగా మలచిన మహా యోగమ్మే
అంచెలంచెలుగా
ఆత్మ దర్శనమగును - కొంగు బంగారమౌ కొడవంటి మాట
93.
మనసునే రంజింప మనో నేత్రమ్ము – అమనస్క యోగమే అంతరార్ధమ్ము
ఘనమైన
ఆనంద సాగరమ్మదియే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
94.
అంతరమునందొక అద్భుతమ్మున్నది – నిత్య సంతోష సాగరమ్మదియే
చైతన్య
జగతిలో సంచారమే అది - కొంగు బంగారమౌ కొడవంటి మాట
95.
దైవ దృష్టి వలన ధారణయె గలుగు – దైవమే నీవని నిర్ధారణగును
దేవ
దేవుడవీవు దేహివి నీవు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
96.
భవ బంధమును బంధ మోచనము చేసి – భావమును బాగుగా మలచినంతటనే
భవ్యమగు
నిర్గుణుడు నీలోన నిలచు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
97.
నామ రూపములవి నామ మాత్రములే – అమరత్వ సిధ్ధికి ఆయుధములు
విమలమగు
వేదాంత సారమ్ము ఇదియే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
98.
యదార్ధమ్మొక్కటియె ఎల్లరకు దర్శనము – నిదానమ్ముగ అదియె నిత్య దర్శనము
మతాతీతమ్మదియె
మోక్ష దర్శనము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
99.
జ్ఞానియగు వానికి జ్ఞానమే తెలియు – మౌనివర్యునకు మృత్యుజయమే తెలియు
లోని
గుట్టు తెలియ నిజ లోకమే తెలియు - కొంగు
బంగారమౌ కొడవంటి మాట
100.
బొందియుండగ పొందనగునది అదియే – అంతమెరుగని అనంతమ్మును అదియే
మృత్యుజయమును
ముక్తి మార్గమును అదియే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
101.
మాట మౌనమె అయిన మనసు బాట – మాట వికలమె అయిన బతుకు బాట
బాటలో
మర్మమే మహరాజ బాట - కొంగు బంగారమౌ కొడవంటి మాట
102.
వేదాంతమే నీవు వెలుగువు నీవు – సదా దర్శనమగును సాధకులకు
చిదానందమ్మది
చైతన్యమదియే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
103.
మౌన ముద్ర లోని మర్మమ్ము తెలిసిన – జ్ఞానమ్ము జ్యోతియై దర్శనమ్మగును
మనిషి
మనీషిగా మార్పు చెందు - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
104.
పరమమగు సత్యమ్ము దర్శనమ్మైన – చిరు చిరు నవ్వుల చిన్మయుండగును
ఎఱుకయే
గలుగు తానెవరొ తెలియు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
105.
దేహమ్మునందలి దేవతను తెలియ – దేహమే దేవాలయమ్మని తెలియు
దేహ
భ్రాంతిని వీడి దైవమే తానగు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
106.
దేహమ్మునందే దైవమ్మునకు నెలవు – మహా సంద్రమ్ములో లవణమున్నట్లు
మహనీయుడైయుండ
మర్మమ్ము తెలియు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
107.
దేహధారివి నీవు దేహమ్ము కావు – దేహమ్మునందలి దేవతవు నీవు
ఆహరహము
ఆనంద నందనుడవీవు - కొంగు బంగారమౌ కొడవంటి
మాట
108.
ఏకాగ్ర చిత్తమున ఎదురు చూచినను – చక్కగా లోలోన చైతన్యముదయించు
నిక్కముగ
నీవేవరొ నీకు తెలియు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
109.
చూపులోన చూపు చూడుమా ఒకసారి – లోలోన వెలుగునే దర్శింపుమొకసారి
ఈప్సితములీడేరు
ఇహము పరమౌను - కొంగు బంగారమౌ కొడవంటి మాట
110.
అక్షయమ్మగునట్టి ఆనందమొందిన – లక్షణమ్మగునట్టి వీక్షణమె కలుగు
లక్ష్యమ్ము
నీవెయగు రహస్యము తెలియు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
111.
విశ్వమంతయును నశ్వరమ్మే గదా – శాశ్వతమ్మదియేను శాంతి మార్గమ్ము
విశ్వ
రహితమ్మగు ఆత్మ నీవేగదా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
112.
దేహి ఎల్లప్పుడు దైవ సంధానమే – బహిరంతరములందు భాసిల్లుచుండు
ఆహరహము
ఆత్మయై ఆవిర్భవించు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
113.
దేహ భ్రాంతిని వీడ దేహివే నీవు – మహిలోన ఎల్లరకు మహా యోగంబు
మహిలోన
మర్మమీ మహిమను గనుటే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
114.
బహిర్దర్శనము బహు విధములైనది – ఆహరహము అంతరమ్మంతటనొకటే
బహిరంతరమ్ముల
మర్మమ్ము గనుమా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
115.
నీలోన నాలోన నిక్కమ్మొక్కటియే – సాలోచనముననే సత్య దర్శనము
ఆలోచనలు
ఆగు అద్భుతమ్మదియే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
116.
ధనముతో పనిలేని దివ్య పురుషుడవీవు – మనసు నిర్మలమైన మనీషివి నీవు
వినయముగ
వీక్షింప విశ్వంభరుడవీవు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
117.
కాళరాత్రియె సుమ్మి కానుపించునది – వేళ మించకుండ వెలుతురును గనుమ
వెలుతురే
నీవు వేదసారము నీవు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
118.
తెలియబడు విశ్వమ్ము దృశ్యమ్ము సుమ్మీ – తెలివితో తెలియుము నిత్య సత్యమ్ము
తెలివిలో
తెలివియే తురీయమ్ము - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
119.
అనుభవ జ్ఞానమే అమనస్కమయ్యె – అనుభవమ్ముననే ఆత్మ దర్శనము
అనూహ్యమ్మైనట్టి
అద్భుతమ్మిదియే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
120.
నిశ్చలత్వమ్మున నిజ రూప దర్శనము – స్వఛ్చమగు శక్తితో సమ్మోహనమ్ము
రచ్చకీడ్వగలేని
రహస్యమ్మిదియే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
121.
మూడు అవస్థల మూలమును గనుమా – వేడుకల వేల్పు నీవెంట నిలచు
కీడు
లేనట్టి కీలకము తెలియు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
122.
అంచెలంచెలుగా అందలమ్మెక్కిన – చంచలమ్మగు బుద్ధి చైతన్యమగును
వంచనయె
లేని వైభవమ్ము కలుగు - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
123.
వియోగము విరహమై వైరాగ్యమంద – నియోగింపుమ్మొక
నూత్న మార్గమున
శ్రేయో
మార్గమే శ్రేష్ఠమైనది కదా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
124. సూర్యోదయమ్మును చక్కగా చూచిన –
అరుణోదయమ్మే జరుగును లోలో
కార్యోన్ముఖునకు కఠినమ్ము
కాదిది - కొంగు బంగారమౌ కొడవంటి మాట
125.
ఎఱుక ఒక్కటియే ఉన్నతమ్మైనది – ఎఱుకయే గలుగు ఏకాగ్ర చిత్తమున
విరాట్పురుషుడవై
వెలుగొందగలవు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
126.
గురుని ప్రేరణయే గురుతుగానున్న – చక్రమ్ములన్నియు చక చక తిరుగు
చిత్రమైనట్టి
చిద్రూపమే వెలయు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
127.
సంతలోనిదికాదు సాధన అనునది – ఎంత వెచ్చించినా కొనుటకు దొరకదు
వింత
పోకడగల వేదాంత సారమది - కొంగు బంగారమౌ కొడవంటి మాట
128.
కొబ్బరి కొట్టిన కోర్కెలు తీరునా – నిజముగా దైవము దక్షిణలు కోరునా
నిజ
భక్తి కావలె నిర్గుణత్వము తెలియ - కొంగు బంగారమౌ కొడవంటి మాట
129.
వత్తి జ్వలనమ్ము నూనె వున్న వరకే – తిత్తి మనుగడయే జీవమున్నవరకె
ముక్తి
కాంత వలపు మూలమును గనుమా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
130.
సత్యముతొ సంధానమదియె సన్యాసమ్ము – సతమతము కావద్దు సంసారమొదలొద్దు
హితము
మితముననే ఈప్సితమ్మీడేరు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
131. శిధిలమగునదియే శరీరమ్ము –
అర్ధ బలమెంతున్న సుద్ధ వ్యర్ధమ్ము
బుద్ధి
బలముననే భానోదయమ్ము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
132.
చక్ర భ్రమణమ్ము చక్కగా చేసిన – శిరోభ్రమణమ్ము స్థిరముగా చేసిన
దర్శనమ్మగును
స్వస్వరూపమ్ము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
133.
సుషుమ్న అదియే సూక్ష్మ దర్శనము – విషయ వాంఛలకు విఘాతమ్మైనను
విశ్వ
రూపమ్మునే కను విందు చేయు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
134.
అంచెలంచెలుగా అందలమ్మెక్కాలి – అక్కడనె నీకు నిక్కమ్ము తెలియాలి
నిక్కమ్ము
తెలిసిన నీకు విజయమ్మే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
135.
అనుభవమ్ముననే ఆస్తికుండగును – లేనివారందరు నాస్తికులె సుమ్మి
అనుభవమ్మనిన
బ్రహ్మానుభవమే - కొంగు బంగారమౌ కొడవంటి మాట
136.
నిప్పు నివురుగప్పి నిండుగానుండు – ఉప్పు కప్పురంబునొక్క పోలికయే
చెప్పలేము
మనము చైతన్యుడెవరో - కొంగు బంగారమౌ కొడవంటి మాట
137.
విజ్ఞానమయకోశమొకసారిగనుమ-సుజ్ఞానివైతేను సూటిగాగానుమ
ఏ
జ్ఞానమైన ఏకాగ్రతనె గలుగు -కొంగు బంగారమౌ కొడవంటి మాట
138.
మాయ కమ్మి యుండె మసి బారి పోయె – మాయదారి దారి మనలోన కలదు
మాయయే
తొలగిన మహా దర్శనమె - కొంగు బంగారమౌ కొడవంటి మాట
139.
పుట్టి గిట్టు నట్టి చట్టు బండయెకదా – మట్టిలో మట్టియై మటుమాయమగును
గుట్టునే
కనుగొని గట్టునే చేరుమా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
140.
నీలోన నాలోన నిజము దాగుంది – అంతరానందమ్ము చవిచూపుతుంది
అంతటను
నిండి హాయిగొలుపుతోంది - కొంగు బంగారమౌ కొడవంటి మాట
141.
లోలోనగల ఇంద్ర ధనుసు దర్శింప – జలమంతరించు జ్యోతి ప్రజ్వలించు
జ్వలియించు
జ్యోతియే జగము చూపించు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
142.
గురు పరంపరలో గుట్టునెరిగినను – పర తత్త్వమే తెలియు పామరునకైన
సర్వత్ర
రంజిల్లు చైతన్యమే వెలయు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
143.
కనులార్పకుండ కాలమును వీక్షింప – కనులార గాంచు కమనీయ కాంతి
కనుబొమల
నడుమ కూటస్తు దర్శనము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
144.
వీసమైనను ఆస లేకుండ యున్న – ఇసుమంతయైన ఈర్ష్య లేకున్న
వాసనలు
అన్నియు వదలునోయన్న - కొంగు బంగారమౌ కొడవంటి మాట
145.
ఉన్నది లేనిది ఆనందమైనచో – ఆనందమే నిండు అంతటను నీకు
ఆనంద
జలధిలో అమృతము గ్రోలెదవు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
146.
ఆనందమున్నది నీలోన నాలోన – అదియె మనలోన ఆవిర్భవించె
అది
అంతనొక్కటై అంతటను నిండె - కొంగు బంగారమౌ కొడవంటి మాట
147.
మాయ జగతిలో మనసు గతి తెలియ – మాయ తొలగు మహదానందమే కలుగు
మాయ
వీడిన మనిషి మహితాత్ముడగును - కొంగు బంగారమౌ కొడవంటి మాట
148.
అంతరించినయంత అరిషడ్వర్గము – అంతరానందమే అంకురించుచునుండు
అంతరానందమే
ఆత్మ దర్శనమగు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
149.
అద్భుతమ్మైనది ఆత్మ దర్శనము – నిద్దురలొ తెలివిలో నిర్గుణమ్ము
బుద్బుదమ్మగు
దేహమందు దర్శనము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
150.
రాలిపోవును దేహమేనాటికైన – గాలి పోయిన క్షణమె గల్లంతు సుమ్మి
కాలిపోవలసినదె
కాటిలో కట్టె - కొంగు బంగారమౌ కొడవంటి మాట
151.
రాలిపోవునుకదా రాగమెందులకు – తూలిపోవును కదా తృష్ణ ఎందులకు
మాలిమితొ
రంజింప మనోజయమ్మె - కొంగు బంగారమౌ కొడవంటి మాట
152.
నేను నాది అని మురియుటెందులకు- వినోదములన్నియు వీడుటే సుఖము
కనుగొని
గుహ్యమును కనుల మధ్య - కొంగు బంగారమౌ కొడవంటి మాట
153.
ఆటకంతకు మూలమీమాయ మనసు – ఆటంకములు వీడ హాయియే అంతా
కటకమందున
కాంతి కనువిప్పు కలుగు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
154.
మనసు మూగబోయి మౌనమే భాషైన – మనోనేత్రమ్మొకటి విచ్చుకొనును
మనలోని
దేవాది దేవు దర్శనమగు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
155.
భక్తి పరాకాష్ట భగవదనుగ్రహము – ముక్తి మార్గమునకు మూల సూత్రమ్ము
భక్తి
లేకున్నచో ముక్తియే లేదుగా - కొంగు బంగారమౌ కొడవంటి మాట
156.
మాయ లోకమ్మెపుడు విభ్రాంతి మయము – మాయను నిర్జింప మహనీయుడగును
కాయమ్ములోనున్న కాంతినే గాంచుమ - కొంగు బంగారమౌ కొడవంటి మాట
157. తత్త్వమసి అది నీ నిజ రూపమే
సుమ్మి – తత్త్వమ్ము తెలియుటే తనువునకు హాయి
సతమతము
కావద్దు నీమతమె నీది - కొంగు బంగారమౌ కొడవంటి మాట
158.
కాలమ్ము నిర్జింప తరమెవ్వరికి గాదు – కాలమాగదు కోట్లు గుమ్మరించినను
కాలయాపన
లేని కర్తవ్యమే మిన్న - కొంగు బంగారమౌ కొడవంటి మాట
159.
విశ్వరూపమ్మదియె స్వస్వరూపమ్ము – విశ్వమయమైన చైతన్యమదియే
నశ్వరము
దేహమ్ము శాశ్వతము దేహి - కొంగు బంగారమౌ కొడవంటి మాట
160.
కొలువయ్యె శివుడు హృదయ కుహరాన – నిలువుటద్దాన నీమాదిరున్నాడు
కల్లోలమే
వీడ కాననగు నిజము - కొంగు బంగారమౌ కొడవంటి
మాట
161.
అంతరించాలి దేహమను భ్రాంతి – అంకురించాలి దేహమున కాంతి
అంకురించినదే
ఆనందమవ్వాలి - కొంగు బంగారమౌ కొడవంటి మాట
162.
పరము దర్శించెడి పట్టు కావాలి – పర తత్త్వమందు పట్టు కుదరాలి
పరమ
పురుషుడవీవు పరము నీవు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
163.
ఆలయాన చేయు ఆరాధనే మేలు – ఆలయమె దేహము అంతరాత్మే నీవు
వెలసెనదె
నీలోన విశ్వరూపమ్ము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
164.
కాలయాపన లేదు కపటము లేదు – కలయజూడు నిన్ను నీవె కాంచెదవు
కల్గునదె
నీకు శాశ్వతానందమ్ము - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
165. కొత్త పాతలులేని కొండ దేవరవు –
చిత్తమే లేనట్టి చిదంబరుడవు
విత్తమే
తెలియని విరూపాక్షుడవు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
166,
పుట్టుట గిట్టుట లేనివాడవు నీవు – తొట్టతొలి మెట్టుపై దొడ్డ దేవరవీవు
అట్టహాసము
వీడ అంతయు తెలియును - కొంగు బంగారమౌ కొడవంటి మాట
167.
శక్తి స్థానము నీవు శాశ్వతుడవీవు – శక్తియే నిలచే నీ సహస్రారమున
శక్తి
పాతము నీకు సహజమ్ము సుమ్మీ - కొంగు బంగారమౌ కొడవంటి మాట
168.
చిద్విలాసుడవీవు చిన్మయుడవీవు – చిదంబరము నీవె చిదానందము నీవె ద్వంద్వాతీతమగు
దైవమును నీవె - కొంగు బంగారమౌ కొడవంటి మాట
169. పరము దర్శించెడి పట్టు
కావాలి – పరమాత్మ తత్త్వమ్ము పట్టుకోవాలి
పరమ
పురుషుడవు పరమాత్మ నీవు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
170.
అంతు లేనివియే కొర్కెలనబడును – అంతకంతకు అవి అలవి కాకుండు
చింతలే
విడనాడి చిత్తమును శాసించు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
171.
చిత్తమును శాసింప శాంతి జనియించు – శాంతి మాటుననే చైతన్యముదయించు
చైతన్యమే
నీవు శరీరము కావు - కొంగు బంగారమౌ కొడవంటి
మాట
172.
అమ్మ అనసూయకు అసూయయె లేదు – అమ్మయే ఆమె అద్వైతమునకు
అమ్మ
అందరకు కమ్మనైన మనసు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
173.
కాషాయమునలేదు ఖద్దరున లేదు – ఆషామాషీ కాదు అంతరమెరుగ
వేషాలు
వేయకుర వెఱ్ఱినాగన్న - కొంగు బంగారమౌ కొడవంటి మాట
174.
సాధకులకు జయము జయ వత్సరమ్ము – సాధన బాగుగా సాగు సతతమ్ము
వేదాంతసారపు
వెలుగు నిండనుగలదు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
175.
హఠమనంగ సూర్యుడు చంద్రుడు – శరీరమునందుండు ఇడ పింగశులవి
సుషుమ్నోదయమ్మై
చైతన్యమే తెలియు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
176.
మనిషిలో గలదు మర్మమౌ కుండలిని – గుహ్య విద్యయె అది గుట్టుగా తెలియు
పాలలో
వెన్నవలే పరిపక్వమగును - కొంగు బంగారమౌ కొడవంటి మాట
177.
మీ లోపల నాలోపల లోలోపల గుట్టు తెలియ లోకమె తెలియున్ (అలా తెలిసినవారు)
సర్వ
ముక్తులగుచు సర్వము తామగుచు నిర్గుణ తత్త్వమ్ము తెలియగలరు
178.
సర్వ మతముల సారమొక్కడే దైవము – సరియైన మార్గమున సాక్షాత్కారమౌ
నిరంజనుడవు
నిజముగా నీవు - కొంగు బంగారమౌ కొడవంటి మాట
179.
వర్తమానమునే వాస్తవము తెలియు – సద్వర్తనమున సకలము తెలియు
నిర్వికారుడవు
నిరాకారము నీవె - కొంగు బంగారమౌ కొడవంటి మాట
180.
ఆడంబరములన్ని హరియించిపోవు – నీడయై తోడుండు నిరాడంబరము
నీడయే
చేర్చు నిను పరమ పదము - కొంగు బంగారమౌ కొడవంటి మాట
181. దేహ భ్రాంతిని వీడ దేహివే నీవు - దేహికిని
లేవు చావు పుట్టుకలు
మహిలోనిదియే మహిమాన్వితమ్ము - కొంగు బంగారమౌ
కొడవంటి మాట
182. మనిషిలోనున్నదే మహిమాన్వితంబు – అనితర
సాధ్యమౌ అసాధ్యమ్మదియే జనియించే లోనుండి
జటిలమౌ శక్తి – కొంగు బంగారమూ కొడవంటి మాట
183.
ఆలయమ్మేదైన ఆదేముడొక్కడే – కాలమే లేనట్టి కాంతిపుంజమ్మదియె
నేల
నింగి నిండు నిత్య చైతన్యమే – కొంగు బంగారమౌ కొడవంటి మాట
184.
శోధించి సాధించు సత్యము దర్శించు – బాధలెదురైన జయము వరియించు
హంగులన్ని
అపుడు అమరియుండు – కొంగుబంగారమౌ కొడవంటి మాట
185.
దేహమ్ములోగలదు దివ్యమగు శక్తి – దేహియనబడునదియె ధ్యాతకెరుక
దేహిగా
మారుటే ధ్యానమనబడునుగా - కొంగుబంగారమౌ కొడవంటి మాట
Comments
Post a Comment